కొత్త UGC నిబంధనలు..ఉపకులపతి నియామకాలు

కొత్త UGC నిబంధనలు..ఉపకులపతి నియామకాలు
భారత ప్రభుత్వం పార్లమెంటు చట్టం:

భారత ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా 1953లో ‘విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం’ (UGC)ను ఏర్పాటు చేసింది. దేశంలోని విశ్వవిద్యాలయాలను ఈ సంస్థ పరిధిలోకి తీసుకొచ్చి డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం కల్పించడం ఈ సంస్థ బాధ్యత. విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం, నాణ్యమైన విద్యను బోధించడం, నాణ్యత కలిగిన పరిశోధనలు జరిగేలా చూడటం యూజీసీ బాధ్యత.

UGC కమిటీలు..డీమ్డ్ విశ్వవిద్యాలయాలు:

డీమ్డ్ విశ్వవిద్యాలయాల స్థాపనలో మానవ వనరుల అభివృద్ధి శాఖకు UGC కమిటీల ద్వారా సిఫార్సు చేయటం, అర్హత కలిగిన విశ్వవిద్యాలయాలను, కళాశాలలను గుర్తించి వాటికి ఆర్థిక సహాయం చేయటమే కాకుండా, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో యూజీసీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉత్కృష్ట ప్రమాణాలతో నడుస్తున్న కళాశాలలను గుర్తించి, స్వయం ప్రతిపత్తి హోదా కలిగించటం, ఆర్థిక సహాయం చేయటం, ఉన్నతమైన విశ్వవిద్యాలయాలలో పరిశోధనలకు ఎక్కువ నిధులు కేటాయించటం మొదలైనవి యూజీసీ బాధ్యతలు.


దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పార్లమెంటరీ చట్టం ద్వారా; రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర అసెంబ్లీ చట్టం ద్వారా ఏర్పాటవుతాయి. UGC కమిటీ సిఫార్సు మేరకు కేంద్రీయ విద్యాశాఖ యూజీసీ చట్టం ద్వారా (Section 3 of U.G.C act) విశ్వవిద్యా లయాలు ఏర్పాటవుతాయి. ఇక రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఆయా రాష్ట్ర శాసనమండలి, ప్రభుత్వాల చట్టం ద్వారా అనుమతులతో ఏర్పడతాయి.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.

భారతదేశంలో విద్యాలయాలు :

భారతదేశంలో ప్రస్తుతం 1000 పైచిలుకు విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 56 కేంద్రీయ విశ్వ విద్యాలయాలు కాగా, దాదాపు 375 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, నాలుగు వందల పైచిలుకు రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇక పోతే 130 పైగా డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ విశ్వ విద్యాలయాలు సమర్థంగా, ప్రగతి పథంలో పయనిం చాలంటే సమర్థత కలిగిన, మంచి అనుభవం కలిగిన విద్యావేత్తలను కులపతులుగా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉపకులపతులుగా ఎటువంటి వారిని నియమిస్తే విశ్వవిద్యాలయాలు బాగుపడుతాయో పలు కమిటీలు, రాధాకృష్ణ కమిటీ (1948), డాక్టర్ కొఠారి కమిటీ (1966), జ్ఞానం కమిటీ (1990), రామ్ లాల్ పరీఖ్ కమిషన్ (1993) విలువైన సూచనలు ఇచ్చాయి. ఈ కమిటీలు కూడా మంచి పరిజ్ఞానం, పరిపాలన దక్షత కలిగిన వ్యక్తులను, విశ్వవిద్యాలయ ఉపకులపతులుగా నియమించడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. పరీఖ్ కమిటీ అయితే ప్రభుత్వ అధికారులు కాకుండా విద్యాసంస్థల పరిపాలన
అనుభవం కలిగిన వారిని నియమించటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

కొత్త UGC నిబంధనలు :


కొత్త UGC నిబంధనల ప్రకారం పరిశ్రమల విభాగం నుంచి గాని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి గాని,ఉపకులపతులుగా నియమించవచ్చు. ఈ ప్రతిపాదనలు కొత్త సమస్యను తీసుకువచ్చాయి. ఏ ఏ సంస్థలు నిపుణులు ఆయా సంస్థలకు అధిపతిగా ఉండటం మంచిది. ఒక సంస్థ నుంచి విద్యారంగంలో అనుభవం లేని వ్యక్తులను, విశ్వవిద్యాలయ వ్యవస్థలో పరిపూర్ణ జ్ఞానం లేని వ్యక్తులను ఉపకులపతులుగా నియమించడం వ్యతిరేకించారు.


రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసిన మూడు పేర్లలో రాష్ట్ర గవర్నర్ ఒకరిని ఉపకులపతిగా నియమిస్తారు. ప్రస్తుతం సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ మెంబర్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకరు, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారా ఒకరు, UGC నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. UGC కొత్తగా తెచ్చిన సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సభ్యుడి బదులుగా గవర్నర్ తరపున సభ్యుడిని ప్రతిపాదించి రాష్ట్ర ప్రభుత్వాలలో ఒక అలజడి తీసుకొచ్చింది.

UGC కొత్తగా తీసుకొచ్చిన సవరణ :

UGC కొత్తగా తీసుకొచ్చిన సవరణను తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ వ్యతిరేకించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, విద్యావేత్తలూ వ్యతిరేకిస్తున్నారు. సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీల విషయానికొస్తే కేంద్ర విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నుంచి ఇద్దరు మెంబర్లు ఉండగా, ఒకరు విశ్వ విద్యాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ నామినేట్ చేసిన వ్యక్తి కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురూ వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి ముగ్గురు వ్యక్తులను కేంద్ర మానవ వనరుల శాఖకు పంపిస్తారు. ఆ శాఖ వీరి పేర్లను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ జాబితా నుంచి ఒకరిని కేంద్రీయ విశ్వవిద్యాలయ కులపతిగా నియమి స్తారు.

కేంద్ర మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం ఉపకులపతిని నియమిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, విశ్వవిద్యాలయం ఎగ్జి క్యూటివ్ కమిటీ నుంచి ఒకరు, UGC నుంచి ఒకరు ముగ్గురు సభ్యులు సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యులు మూడు పేర్లను రాష్ట్ర విద్యాశాఖకు సమర్పిస్తారు. ఈ మూడు పేర్లను గవర్నర్కు పంపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వ్యక్తిని కాకుండా, గవర్నర్ ఇంకొక వ్యక్తిని విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

నందమూరి తారకరామారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాల యాక్టు సవరణ చేసి ప్రభుత్వం పంపిన ముగ్గురు పేర్లలో ప్రభుత్వం సూచించిన వ్యక్తినే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించాలని సూచించారు. దాని ప్రకారం ప్రభుత్వం సూచించిన వ్యక్తినే ఉపకులపతిగా నియమించేవారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ముందు పద్ధతినే అనుసరించి ఉపకులపతిని నియమించే అధికారం గవర్నరికే ఇచ్చాయి.


ఇక రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల విషయాని కొస్తే ఉపకులపతులను నియమించే అధికారం పూర్తిగా మేనేజ్మెంట్ మీద ఉంటుంది. సెర్చ్ కమిటీని నియమించి మేనేజ్ మెంటుకు కావలసిన వ్యక్తిని
కులపతి… ఉపకులపతిని నియమిస్తారు. మేనేజ్మెంట్ వారు గానీ, వారికి బాగా తెలిసిన వ్యక్తి గాని విశ్వవిద్యాలయం కులపతిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉపకులపతుల నియామకాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదు.

ఉపకులపతి నియామకాలు :


విశ్వ విద్యాలయం స్థాపించడం, వాటికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించడం, ఆర్థిక వనరులు కల్పించా ల్సిన బాధ్యతలున్న రాష్ట్ర ప్రభుత్వాలకు విశ్వవిద్యా లయాల ఉపకులపతిని నియమించే అధికారం లేదంటే ఆలోచించదగిన విషయం.ఇకపోతే UGC ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనల్లో ఉపకులపతులను నియమించడంలో, పరిశ్రమల నుంచి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, పబ్లిక్ పాలసీ నుంచి, వైజ్ఞానిక పరిశోధనా సంస్థల నుంచి వ్యక్తులను తీసుకురావడం సమంజసం కాదు.

గొప్ప విద్యావంతులు, మేధావులు, ప్రతిభావంతులు, విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులుగా అనుభవం కలిగిన వ్యక్తులను ఉపకులపతులుగా నియమించడం ఉన్నత విద్యను ప్రగతిపథంలోకి తీసుకురావడానికి ఉపయోగ కరంగా ఉంటుంది.విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య, పరిశోధనలు, ఇన్నోవేటివ్ కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచ విశ్వవిద్యాలయాలకు పోటీగా తీసుకురావడంలో తగు సూచనలు ఇవ్వడం మంచిది.